తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం శుక్రవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుంచి రుద్రయాగం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. గృహస్తులు రూ.500 చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చని వెల్లడించారు.