YS Bhaskar Reddy | వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. ఆయన ఈ నెల 29 వరకు రిమాండ్‌లోనే ఉండనున్నారు. జడ్జి తీర్పు తర్వాత అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసీలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని పులివెందులలో సీబీఐ అధికారులు ఇవాళ ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారీ బందోబస్తు మధ్య ఆయనను హైదరాబాద్ తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓపీ భవనంలో ఉన్న అత్యవసర విభాగంలో భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. మొదట ఈసీజీ పరీక్షలు చేయగా.. తీయగా నార్మల్‌గానే వచ్చింది.
తర్వాత బీపీ పరీక్షలు నిర్వహించగా.. అతనికి బీపీ కొద్దిగా పెరగడంతో క్యాజువాలిటీ డీఎంఓ డాక్టర్ మునావర్ నేతృత్వంలో వైద్యులు భాస్కర్ రెడ్డికి బీపీ కంట్రోల్ అయ్యేందుకు మందులు ఇచ్చారు. అనంతరం క్యాజువాలిటీలో బీపీ తగ్గే వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ తర్వాత అధికారులు సీబీఐ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే, భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం బాగాలేదని న్యాయవాది జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో జాగ్రత్తగా చూడాలని జైలు అధికారులకు సూచించారని భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశం ఉందనే అరెస్టు చేసినట్లు రిమాండ్ సీబీఐ పేర్కొంది. అదే సమయంలో కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, విచారణకు అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం ఉందనే అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సీబీఐ తెలిపింది.