YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి విచారణకు సిద్ధమని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముగిసిందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలిస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
వివేకా హత్య కేసులో మరింత విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేసులో మరింత విచారణ జరగడంతో పాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని సునీతకు సూచించింది.
రెండు వారాల్లోగా ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు వైఎస్ సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.