విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై సోమవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. గుంటూరు వైపు వెళ్తున్న కారు పారిశుధ్య కార్మికులపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం ఫ్లైఓవర్‌ను పారిశుధ్య కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో గుంటూరు వైపు వెళ్లేందుకు ఫ్లైఓవర్‌పైకి వచ్చిన కారు.. కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ నాగూర్బా (35) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీపంలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గాయపడిన వారిని వేముల వెంకట లక్ష్మి (ప్రకాష్ నగర్), లంకా జయ కుమారి (సింగ్ నగర్), దుర్గా జయభవాని (సింగ్ నగర్), వెంకటేశ్వర్ రావు (నున్న) గా గుర్తించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ నిమిత్తం కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఫ్లైఓవర్‌పై వాహనాలు నిర్ణీత వేగం కన్నా ఎక్కువ వేగంలో వెళ్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. భవిష్యత్‌లో ఫ్లైఓవర్‌పై ప్రమాదాలకు తావు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.