అమరావతి: ఏపీలో ఎక్సైజ్ నేరాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్-Special Enforcement Bureau) ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు డీజీపీ(AP DGP) ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumalrao) బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. సెబ్ సిబ్బంది ఎక్సైజ్(Excise) శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
గత వైసీపీ హయాంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వ్యవస్థను తీసుకువచ్చారు. ఎక్సైజ్ శాఖ ప్రధానంగా ఆదాయం వైపు, సెబ్ నేరాల వైపు దృష్టిని సారించి కార్యకలాపాలను పర్యవేక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్సైజ్ పాలసీపై నూతన విధానం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో ఖరారు కానున్న ఈ నూతన విధానంలో భాగంగా ముందుగా సెబ్‌ను ఎత్తివేసి ఎక్సైజ్‌లో విలీనం చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో 30 శాతం సిబ్బంది ఉండగా, ఎస్ఈబీలో 70 శాతం మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 6వేల మంది సిబ్బందిలో, దాదాపు 4,000 మంది సిబ్బందిని సెబ్‌కు కెటాయించారు. దీనికి 18 మంది ఐపీఎస్ అధికారులు, ఇద్దరు డీఎస్పీలు, పదుల సంఖ్యలో ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. సెబ్‌లో పనిచేస్తున్న వారంతా ఎక్సైజ్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులో డీజీపీ పేర్కొన్నారు.