Harish Rao | కాంగ్రెస్ పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం అని హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య పాలన అని, భావ ప్రకటనా స్వేచ్ఛ అని, నిరసన తెలిపే హక్కులను కాపాడుతామని అభయహస్తం మేనిఫెస్టో మొదటి పేజీ, మొదటి లైనులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సోనియమ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తే.. నేను ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తాన్నడని చెప్పారని.. తీరా చూస్తే ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై హైదరాబాద్ తెలంగాణ భవన్లో ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని అన్నారు. నిరసన తెలిపే హక్కు లేదని.. నిరంకుశత్వమే మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధ కాండను రుచి చూపిస్తున్నడని చెప్పారు. స్కూళ్ల ముందు పోలీసు పికెట్లు, హాస్టళ్ల ముందు పోలీసు పికెట్లు ఎన్నడన్న చూసినమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంతూరుకు ఎవరైనా పోవాలంటే పోలీసు స్టేషన్లో అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన దుర్మార్గాన్ని ఎన్నడన్నా విన్నామా? కన్నామా? అని అడగారు. పోలీసులతోనే పోలీసు కుటుంబాలను కొట్టించిన ఘనుడీ ముఖ్యమంత్రి అని విమర్శించారు. మీడియాపై ఆంక్షలు విధించిండని.. సోషల్ మీడియాపై కేసులు పెట్టించిండని అన్నారు.
రాజకీయకక్షతో తప్పుడు కేసులు పెట్టడం, అవి న్యాయస్థానాల్లో వీగిపోవడం కాంగ్రెస్ ఏడాది పాలనలో సర్వసాధారణంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. చదువుకునే లైబ్రరీల్లో లాఠీఛార్జీ చేసిండ్రని.. నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక నగరాన్ని శోక నగరంగా మార్చారని విమర్శించారు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేశారని అన్నారు. లగచర్ల లంబాడీ బిడ్డల మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించారని.. ఎమర్జెన్సీని తలపించారని.. యమభటుల్ని మరిపించారని మండిపడ్డారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కొట్లు, ఒట్లు నోట్లు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ల మీద ఒట్లు, తనకు తన వారికి దోపిడీ సొమ్ము నోట్లు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలన తెలంగాణ ప్రజలను సంపూర్ణంగా హతాశులను చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ చేసిన పదేండ్ల అభివృద్ధిని 12 నెలల్లోనే పాడు చేశారని మండిపడ్డారు. పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షేమం కూనరిల్లిందని.. సంక్షోభం ముంచుకొస్తుందని హరీశ్‌రావు తెలిపారు. అభివృద్ధి జాడలేదని.. అణిచివేత విరుచుకుపడుతున్నదని అన్నారు. మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిలించిందని పేర్కొన్నారు.ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో రేవంత్ మార్కు ప్రజా పాలన వర్ధిల్లుతున్నదని విమర్శించారు. ఏడాది పాలనలో ఏం కోల్పోయామో ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని కేసీఆర్ అన్న మాట అక్షర సత్యమని చెప్పారు. సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్.. ఎగతాళిగా మాట్లాడుతున్నాడని.. ఎగిరెగిరి పడుతున్నాడని చెప్పారు
కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతు బంధును కోల్పోయారని.. మత్స్య కారులు చేప పిల్లల పంపిణీ కోల్పోయారని.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బంధును కోల్పోయారని.. బీసీలకు బాసటగా నిలిచిన బీసీ బంధును కోల్పోయారని.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఓవర్సిస్ స్కాలర్ షిప్స్ కోల్పోయారని.. గర్బిణులు కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్టును కోల్పోయారని.. ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు కోల్పోయారని తెలిపారు. మైనార్టీస్ కో క్యాబినెట్ మే బీ జగా నహీ మిలా.. కం సె కం నౌ దిన్ కా జష్న్ మే బీ ఉన్ కా జికర్ నహీ.. షాదీ ముబారక్ కే ఏక్ తులా గోల్డ్ కా కుచ్ పతా నహీ.. ఏక్ సాల్ మే కాంగ్రెస్ నే మైనార్టీస్ కో పూరీ తరహా నజరందాస్ కర్ దియా.. లంబాడి బిడ్డలు మంత్రివర్గంలో స్థానం కోల్పోయారని.. పేద బ్రాహ్మణులు ప్రభుత్వ సహాయాన్ని కోల్పోయారని.. ఇండ్లు కూలిన పేదలు సర్వస్వం కోల్పోయారని.. చివరకు అమ్మ ఓడిలోనో, బడిలోనో ఆనందంగా ఉండాల్సిన పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్ర ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారని చెప్పారు. ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చారని విమర్శించారు.