Botsa Satyanarayana | అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వినేందుకు సిగ్గుపడుతున్నామని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగానే ఉన్నాడా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో అయినా భాగమయ్యాడా అని నిలదీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, టాలీవుడ్లో ముఖ్యమైన హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు.
మమ్మల్ని ఎవరేం పీకుతారని సభలో నారా లోకేశ్ అన్నారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. వాళ్ల వ్యవహార శైలి అలాగే ఉందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేదని.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, కేంద్ర మాజీ మంత్రి అన్న గౌరవం కూడా లేదని మండిపడ్డారు. బాలకృష్ణ పెద్ద పుడింగి అని అనుకుంటున్నారని.. ఏం చూసుకుని మీకు ఇంత అహంభావమని ప్రశ్నించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు టీడీపీ నుంచి వివరణ రాలేదని అన్నారు. స్పీకర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడని.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని అవమానిస్తే పట్టించుకోరా అని నిలదీశారు. కేవలం సభా సంప్రదాయాల గురించే మాట్లాడుతున్నామని తెలిపారు. చిరంజీవిని అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది మాకు అనవసరం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.
శాసన మండలి చైర్మన్ సీటులో దళితుడు కూర్చున్నాడని అవమానించాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు అందించాలని సూచించారు. శాసనసభ, మండలిని ఏ ప్రభుత్వం కూడా స్వప్రయోజనాల కోసం చూడలేదని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోఉభయసభలను తమ జేబు సంస్థలుగా చూస్తున్నారని విమర్శించారు. మండలి సభ్యులకు రాజ్యాంగపరంగా వచ్చే హక్కులు ఇవ్వడం లేదని అన్నారు. మండలి చైర్మన్‌కు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇదే అంశంపై ప్రశ్నిస్తే సమాధానం లేదని తెలిపారు. అసెంబ్లీని రాజకీయంగా వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సభ్యులకు పెట్టిన క్రీడాపోటీల్లో కూడా చైర్మన్‌ను గౌరవించలేదని.. దీనికి ఎవరు బాధ్యులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పేవరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.