Boat accident : వారణాసిలోని గంగానదిలో యాత్రికులతో వెళ్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 40 మంది సురక్షితంగా బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ ప్రదానాలు చేయడం కోసం 40 మంది ఒక పడవలో ఎక్కారు.
కొంతదూరం వెళ్లాక పడవకు రంధ్రం పడింది. పడవలోకి నీళ్లు రావడం గమనించి వాళ్లంతా భయంతో కేకలు వేశారు. దాంతో, డ్రైవర్ బోటును వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించాడు. కానీ, వారంతా భయంతో అటూఇటూ పరుగులు తీయడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రాణభయంతో వాళ్లు ఆర్తనాదాలు చేయడం చూసిన సమీపంలోని పడవవాళ్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. 40 మందిని రక్షించారు. ఈ విషయం తెలియగానే వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పడవలో ఉన్నవారి వివరాలు ఆరా తీశారు. అయితే.. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యాత్ర ముగియడంతో నిడదవోలు యాత్రికులు మళ్లీ స్వస్థలానికి బయలుదేరారు.