Somu Veerraju | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాలన కోరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేసిన సోము వీర్రాజు.. బీజేపీ ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదని స్పష్టం చేశారు. ధర్నాలు, నిరసనలు చేయడం మానేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని జగన్ను కోరారు.
ఏపీలో వైసీపీ శ్రేణులు, ప్రజలపై జరుగుతున్న దాడులపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ అధినేత జగన్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదో న్యాయస్థానాలను అడుగుతామని పునరుద్ఘాటించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలపై తాజాగా సోము వీర్రాజు స్పందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాలేదని.. అప్పుడే రాష్ట్రపతి పాలన అడగడమేంటని ప్రశ్నించారు.