AP News | ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అంత మొత్తాన్ని గ్రాంట్‌గా ఇచ్చారా? లేదా గ్రాంట్‌గా ఇచ్చారా? అనేది బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ నిధుల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ఆర్థిక నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కేటాయించిన 15 వేల కోట్ల నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.
మంగళవారం జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వేల కోట్ల రూపాయలు అప్పేనని తేల్చి చెప్పారు. ఆ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు. ఈ అప్పును కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా? లేదంటే ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని చెబుతుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రాజధాని అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు అప్పు మాత్రమేనని ప్రతిపక్ష వైసీపీతో పాటు పలువురు ఆర్థిక నిపుణులు ముందు నుంచే చెబుతున్నారు. ఆ డబ్బు తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని.. దీనివల్ల ఏపీ ప్రజలపై అదనపు భారం పడకతప్పదని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కూటమి నేతలు మాత్రం తాము పెద్ద అచీవ్మెంట్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఎలా ఇస్తే ఏంటి అభివృద్ధి కనిపిస్తుంది కదా అని సమర్థించుకుంటున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నిధులు ఏ రూపంలో వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని, రాజధాని నిర్మాణం పుంజుకోవాలంటే ఈ నిధులు ఉపకరిస్తాయని అన్నారు.