Srisailam | శ్రీశైలం : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయల సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కార్యక్రమంలో భాగంగా మొదట అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమంగా నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు. ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు.
సుబ్రహ్మణ్యస్వామి
షష్ఠి తిథి సందర్భంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజుల్లో విశేష అభిషేకం, పూజాధికారులు దేవస్థానం సేవ (సర్కారీసేవగా) నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయని.. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయని.. సంతానం కోసం పూజలు చేసేవారికి సంతానభాగ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోందని పండితులు తెలిపారు. అభిషేకానికి దేశం సంకల్పం పఠించారు. కార్యక్రమం ఆటంకాలు లేకుండా జరుగాలని మహాగణపతి పూజ చేశారు. చివరిగా స్వామివారికి అభిషేకం, అర్చనల తర్వాత సుబ్రహ్మణ్యస్తోత్ర పారాయణలు పఠించారు. అభిషేకంలో స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు భక్తుడు విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన బాల బ్రహ్మాచారి అనే భక్తుడు దేవస్థానం గోసంరక్షణ పథకానికి విరాళం రూ.1,00,116 అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ పర్యవేక్షకులు కే శివప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రశీదు అందించారు. అంతకు ముందు స్వామి, అమ్మవారి దర్శనాలు కల్పించి.. తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేస్త్రవస్త్రంతో సత్కరించారు.
దేవస్థానంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈవో ఎం శ్రీనివాసరావు ఆక్టోపస్ బృందంతో సమావేశం నిర్వహించారు. ఆక్టోపస్ డీఎస్పీ కే సంకురయ్య, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, దేవస్థాన భద్రతా విభాగం పర్యవేక్షకులు మల్లికార్జున సమావేశంలో పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ ఆలయ వేళలు, భక్తులు దర్శనానికి వేచివుండే క్యూ కాంప్లెక్స్‌లో ఆయా ఏర్పాట్లు, క్యూ లైన్ల నిర్వహణ, రోజు వారీగా, ఉత్సవాల సమయాల్లో సగటున ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్య మొదలైన అంశాలను వివరించారు. డీఎస్పీ సంయుకరయ్య మాట్లాడుతూ భక్తుల భద్రతకు సంబంధించిన అంశాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాలపై చర్చంచారు. కాగా, భద్రతా అంశాలకు సంబంధించి ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించనున్నది.