Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊయలసేవ కనుల పండువగా జరిగింది. లోకకల్యాణం కోసం దేవస్థానం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం రోజు, పౌర్ణమి, మూలానక్షత్రం రోజుల్లో ఊయలసేవ జరిపిస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచేపు చేసి శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ నిర్వహించారు.
చివరగా ఊయలసేవలో విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన జరిపారు. ఇందులో భాగంగా పలు రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం స్వామి అమ్మవార్లను రాజస్థాన్ జోద్పూర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ గోపాల్ వ్యాస్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. అనంతరం వేదాశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.