అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి ( Indrakeeladri ) దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి భవాని మండల దీక్షలు (Bhavani Deeksha) భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి లేదా, ఉత్థాన ఏకాదశి రోజున దీక్షలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.
నవంబర్ 1 నుంచి 5 వ తేదీ వరకు మాలధారణలు జరుగుతాయని వెల్లడించారు. 5వ తేదీతో దీక్ష ధారణాలు సమాప్తి అవుతాయని, నవంబర్ 21 నుంచి 25 వరకు అర్థమండల దీక్ష ప్రారంభమవుతుందని వివరించారు. డిసెంబర్ 4న కలశ జ్యోతి ఉత్సవం, డిసెంబర్ 15న భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయని పేర్కొన్నారు.
దీక్ష విరమణలు చేసే ఐదు రోజుల పాటు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశముండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో తెలిపారు.