Indian Student | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ ఆంధ్రా యువతి టెక్సాస్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆమె.. నిద్రలోనే కన్నుమూసింది.
బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ – వీణాకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు రాజ్యలక్ష్మీ కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. అనంతరం ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసేందుకు 2023లో అమెరికా వెళ్లింది. ఇటీవల ఎంఎస్ పూర్తి కావడంతో పట్టా కూడా అందుకుంది. అక్కడే ఉద్యోగం వెతుక్కుని స్థిరపడ్డాలని అనుకుంది. ఇలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రాజ్యలక్ష్మీ అనారోగ్యానికి గురైంది.
రెండు మూడు రోజులుగా దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతోంది. కానీ సాధారణ మందులు వేసుకుంటూ అనారోగ్యాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 6వ తేదీన రాత్రి తన కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాజ్యలక్ష్మీ.. తనకు జలుబు, ఆయాసంగా ఉందని తెలిపింది. ట్రీట్మెంట్ కోసం 9వ తేదీన డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని తెలిపింది. అనంతరం రోజులాగే మందులు వేసుకుని పడుకున్న రాజ్యలక్ష్మీ శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ లేవలేదు. రోజూ టైమ్‌కు లేచి తన పనిచేసుకునే రాజ్యలక్ష్మీ ఎంతకీ లేవకపోవడంతో తన రూంమేట్స్ను లేపేందుకు ప్రయత్నించారు. చలనం లేకపోవడంతో భయపడి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
రాజ్యలక్ష్మీ మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అక్కడి వైద్యాధికారులు శవ పరీక్ష నిర్వహిస్తున్నారు. కాగా, రాజ్యలక్ష్మీ మరణవార్త తెలియడంతో కారంచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజ్యలక్ష్మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన అమెరికాలోని ప్రవాస భారతీయులు రాజ్యలక్ష్మీ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. గోఫండ్‌మీ వేదికగా నిధులు సేకరిస్తున్నారు. అలాగే రాజ్యలక్ష్మీ మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.