అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విలీన గ్రామాల ప్రజలు చేస్తున్న డిమాండ్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై నమ్మకం కోల్పోవడం వల్లనే విలీన గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారని ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు.
వరద బాధితులు గత 14 రోజులుగా బురద నీటిలోనే జీవితాలు వెల్లదీస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సర్కార్ నిర్వాకం కారణంగానే ఏపీలో విలీనం చేసిన గ్రామాల ప్రజలు తెలంగాణకు వెళ్లాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. వరదల కారణంగా ప్రజలు కరెంటు, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ తాగేందుకు నీరు లేదని, విద్యుత్తు సరఫరా అనేక చోట్ల పునరుద్ధరణ జరగలేదని చంద్రబాబు తెలిపారు. విలీన మండలాల్లో దాదాపు 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేదని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు. అధికారులు ఆయా గ్రామాల ప్రజలను పట్టించుకోక పోవడంతోనే వారు రోడ్డెక్కుతున్నారని అన్నారు.
వరదలు తగ్గి వారం రోజులు కావస్తున్నా విద్యుత్ సరఫరాను ఎందుకు పునరుద్ధరించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. విలీన మండలాల్లో బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదన్నారు. అందుకే విలీన మండలాల్లోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్ మాటలు, గాలి పర్యటనలు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ ఇటీవలి గోదావరి వరదల నాటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం, విలీన గ్రామాలపై కూడా రాజకీయాలు వేడెక్కాయి.