విశాఖపట్నం: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌తో విపరీతమైన ముప్పు పొంచి ఉన్నదంటూ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలంటూ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం విశాఖలోని పలు మార్కెట్లలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ర్యాలీగా వెళ్లి అక్కడి విక్రేతలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడొద్దంటూ సూచించారు. అదేవిధంగా వారికి క్లాత్ బ్యాగులను అందజేసి ఇలాంటి వాటిని వాడేలా వినియోగదారులను ప్రోత్సహించాలని చెప్పారు.
ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా విశాఖ బీచ్ రోడ్డులో ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు ఫెయిర్ షేకేసింగ్ ఏర్పాటు చేశారు. జూన్ 5 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. దీనికి చాలా ముందుగా క్లాత్‌లో కుట్టిన సంచుల సరఫరా చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు వ్యతిరేకంగా విస్తృతమైన అవగాహన ప్రచారాలను చేపడుతున్నారు. మున్ముందు ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంపై కూడా జీవీఎంసీ దృష్టి సారించింది.
ప్లాస్టిక్ సామగ్రిని దూరంగా పెట్టడంలో ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తున్నది. జీవీఎంసీ గత కొంత కాలంగా చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలతో ప్రజలు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించినట్లుగా తెలుస్తున్నది. ప్లాస్టిక్ నిషేధంపై వినియోగదారులలో మార్పు తీసుకురావడాన్ని సవాలుతా తీసుకుని అమలుచేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా తెలిపారు. ఆహారాల వ్యాపారం, స్నాక్ సెంటర్లు, టిఫిన్ అవుట్లెట్లు, ఇతర వాణిజ్య యూనిట్లను నిర్వహించే వారిని ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.