హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం విజయవాడలో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’పై ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ప్రతి ఎమ్మెల్యే, మంత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 2029లో నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందని, కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతాయని, అప్పుడు అందరికీ అవకాశమిస్తానని పేర్కొన్నారు. ఎవరినీ వదులుకోవడానికి సిద్ధంగా లేమని, ఎమ్మెల్యే టికెట్ రానివారికి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగిస్తానని నాయకులకు జగన్ భరోసా ఇచ్చారు.