APSRTC | దసరా పండక్కి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా 6,100 బస్సులు నడిపించనుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి ఏపీకి వచ్చే వారితో పాటు, రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం పండగకు ఊళ్లకు వచ్చే వారి కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3040 బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3060 బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 బస్సులు ఏపీలోకి రాకపోకలు సాగించనున్నాయి.
ఇక ఏపీ పరిధిలో విజయవాడ నుంచి 400, వైజాగ్ నుంచి 320, రాజమండ్రి నుంచి 260, ఇతర జిల్లాల నుంచి 730 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడిపించనుంది. కాగా, ఈ బస్సులు అన్నింటిలోనూ సాధారణ ఛార్జిలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్‌ను ముందస్తుగానే రిజర్వేషన్ చేయించుకుంటే.. 10 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.