Cyclone Montha |మొంథా తుపాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులపైకి కూడా వరదనీరు వచ్చి చేరింది. తుపాన్ బీభత్సానికి చెట్లు కూలడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తుపాన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
కాచి వడబోసిన, క్లోరినేషన్ నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తుపాన్ తీవ్రత తగ్గిందని అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్లవద్దని అన్నారు. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
తుపాన్ నేపథ్యంలో దెబ్బతిన్న, పడిపోయిన భవనాల్లోకి వెళ్లవద్దని ప్రఖర్ జైన్ సూచించారు. దెబ్బతిన్న విద్యుత్ పరికరాలు, వస్తువులను వాడే ముందు ఎలక్ట్రీషియన్‌కు చూపించాలని సలహా ఇచ్చారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాల్వలు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.