YS Sharmila | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిలమ్మ పడిపోయారని.. ఆమెను కూడా తమ పార్టీకి శత్రువగానే భావిస్తామని ఆయన కామెంట్ చేశారు. వైఎస్ కూతురు, జగన్ సోదరిగా మాత్రమే ఆమెను గౌరవిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఆమె చేసే వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడటానికి మూలకారణం చంద్రబాబే అని పెద్దిరెడ్డి విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అరెస్టు వెనుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం వెనుక కారణం కూడా చంద్రబాబే అని అన్నారు. వైఎస్ కుటుంబం విడిపోవడానికి కూడా కారణమే చంద్రబాబు అని అన్నారు. షర్మిలమ్మ కూడా బాబు ట్రాప్లో పడిపోయిందని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్న షర్మిలమ్మకు రాష్ట్రం మొత్తం తిరిగి చూస్తే జగన్ చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. ఆ పార్టీని నలుగురు మోస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. రఘువీరారెడ్డి, షర్మిలమ్మ, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు.. ఈ నలుగురు చచ్చిపోయిన పార్టీని మోస్తున్నారని.. ఇంకా ఎవరైనా మిగిలిఉంటే ఉట్టి పట్టుకుంటారని సెటైర్ వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బతికేది లేదు.. బట్టకట్టేది లేదని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ లేనేలేదని అన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని స్పష్టం చేశారు.