Festival Discount | దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (APCO) బంపరాఫర్ ప్రకటించింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగి అటు నేతన్నలకు, ఇటు ధరలు తగ్గడంతో వినియోగదారులకు మేలు జరుగుతుందని ఏపీ చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఆప్కో ఆఫర్ను ఉపయోగించుకుని చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఆప్కో తయారుచేయిస్తున్న చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే ఆప్కో సంస్థకు ఉత్పత్తులను సరఫరా చేసే సొసైటీల్లో పనిచేసే నేత కార్మికుల జీతాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా ఒక్కో కార్మికుడు అదనంగా రూ.3000 వరకు లబ్ధి పొందుతున్నారు.