AP News | ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న మరో బాధితురాలి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ దుబాయ్‌లో నరకయాతన అనుభవిస్తున్నది. చావుకు బతుక్కి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న తనను రక్షించాలంటూ రహస్యంగా ఒక వీడియోను రికార్డు చేసి తన వాళ్లకు పంపించింది. ఈ వీడియో చూసిన పెద్దలు దయచేసి రక్షించాలని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన జ్యోతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీంతో కుటుంబానికి ఎంతో కొంత అండగా నిలబడాలని నాలుగు నెలల క్రితం దుబాయ్‌లోని అబుధాబికి వెళ్లింది. అయితే ఇంటి పనుల కోసం వెళ్లిన జ్యోతిని అక్కడ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సరిగ్గా తిండి కూడా పెట్టకుండా.. నలుగురు చేయాల్సిన పనిని తన ఒక్క దానితోనే చేయిస్తున్నారు. దీంతో తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసింది. దయచేసి తనను ఎలాగైనా తన కుటుంబం దగ్గరకు చేర్చాలని ప్రాథేయపడింది.
సెల్ఫీ వీడియోలో జ్యోతి ఏం చెప్పిందంటే..
‘ ఆర్థిక పరిస్థితుల కారణంగా అబుధాబికి వచ్చా. ఇంటి పనుల కోసం అని నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. ముగ్గురు నలుగురితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. పనులు చేయించుకుని సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి భోజనం పెడుతున్నారు. నెలకు సరిగ్గా జీతం ఇవ్వడం లేదు. ఇంటికి కూడా ఫోన్ చేసుకోనివ్వడం లేదు. వచ్చినప్పటి నుంచి పని ఎక్కువ కావడంతో ఒంట్లో బాగుండటం లేదు. ఆయాసం వచ్చి గుండె లాగేస్తున్నది. ఎంతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగినా పట్టించుకోవడం లేదు. ఇంటికి పంపించమంటే వినిపించుకోవడం లేదు. ఏం చేయాలేకనే ఈ వీడియో పెడుతున్నా. ‘ అని జ్యోతి ఆ వీడియోలో తెలిపింది.
దుబాయ్‌లో మరో మహిళ ఆవేదన
నాలుగు నెలల క్రితం అబుదాబి వెళ్లిన జ్యోతి.
పని ఎక్కువైందని.. తిండి, సరైన వసతులు లేవని ఆవేదన.
సెల్పీ వీడియో ద్వారా ఆందోళన వ్యక్తం చేసిన మహిళ.
తనని ఇండియాకు రప్పించాలని ప్రాధేయపడిన బాధితురాలు.
జ్యోతిది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం… pic.twitter.com/XiXlBfhZyY
— BIG TV Breaking News (@bigtvtelugu) August 5, 2024
దయచేసి ఈ వీడియో చూసిన పెద్దలు, అధికారులు తనను ఈ నరకం నుంచి తప్పించాలని.. తనను తన భర్త, పిల్లల దగ్గరకు చేర్చాలని జ్యోతి వేడుకుంది. తనను తీసుకొచ్చిన వాళ్లు కూడా పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఉండలేక.. ఇంటికి రాలేక ఏం చేయాలో తెలియడం లేదని చెప్పింది. చావుకు బతుక్కి మధ్యలో ఉన్నానని.. దయచేసి తనకు సాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో చేసిన తర్వాత ఎలా ఉంటానో కూడా తనకు తెలియడం లేదని.. భయం భయంగా ఉందని పేర్కొంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జ్యోతిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.