అమరావతి: సోలార్ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, కర్నాటక ఉన్నట్లు ఆశాఖ తెలిపింది. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నాణ్యమైన సౌర విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి పొందాయి.
వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్ యూనిట్ రూ.2.49 పైసలు చొప్పున ఇచ్చేందుకు ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్తును 25ఏండ్లపాటు కొనుగోలు చేయనుంది. ఈ చర్యతో భవిష్యత్తులో ఏపీ స్థానం మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.