ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ సభకు రావాలని కోరారు. ఆయన సభకు వస్తే ఇద్దరం ముచ్చటించుకుంటామని తెలిపారు.
తన నర్సీపట్నం నియోజకవర్గంలో సోమవారం నాడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11వ తేదీన మొదలవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. కీలకమైన ఈ సమావేశాలకు జగన్ వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైఎస్ జగన్ రాక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. జగన్ అసెంబ్లీకి వస్తే ముచ్చటించుకుంటామని పేర్కొన్నారు.
నవంబర్లో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.