MVV Satyanarayana | విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంవీవీకి అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం పూర్తి వివరాలు చెప్పకుండా కిడ్నాప్ కేసు అని తేల్చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఎంవీవీ కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసు పునర్విచారణకు న్యాయస్థానం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాగా ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి వైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్న రౌడీషీటర్ హేమంత్, మరొక నిందితుడితో దాదాపు గంటన్నరపాటు విచారించారనే ప్రచారం జరగడంతో ఇది సంచలనంగా మారింది. కాగా, ఎంవీవీ, జీవీ కోసం అనేక సెటిల్మెంట్లు చేశానని, తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కోపంతోనే కిడ్నాప్ చేశానని నిందితుడు హేమంత్ ఆ విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే ఎంవీవీ చుట్టు ఉచ్చు బిగుసుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలేం జరిగింది?
రౌడీ షీటర్ హేమంత్, అతని స్నేహితులు వలపుల రాజేశ్, సాయి కలిసి గత ఏడాది జూన్ 15వ తేదీన ఎంవీవీ కుమారుడు శరత్‌ను రుషికొండలోని ఆయన ఇంట్లోనే కిడ్నాప్ చేశారు. తర్వాత ఎంవీవీ భార్య జ్యోతి, ఆయన సన్నిహితుడు గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)ని అక్కడకు పిలిపించి బంధించారు. రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి వారి నుంచి రూ.1.70 కోట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో తన భార్య, కుమారుడు కిడ్నాప్‌నకు గురైనట్లు తెలుసుకున్న ఎంవీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక భూదందా ఉందని ఆరోపణలు వచ్చాయి.. కానీ వాటిని ఎంవీవీ ఖండించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ కేసును వైసీపీ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు మళ్లీ ఈ కేసుపై దృష్టిపెట్టారు.