AP News | మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలనే హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ పండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని పైడూరుపాడు గ్రామానికి చెందిన కవిత(34)కు బంధువైన శ్యామ్‌తో 2015లో వివాహమైంది. వీరికి లాస్య(11), సాత్విక్ (9) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం కోసం ప్రయత్నించింది. కానీ ఉద్యోగం రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటుంది. శ్యామ్ తనకున్న సొంత లారీల నిర్వహణతో పాటు సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇక కవిత 2020 నుంచి మానసిక సమస్యలతో బాధపడుతోంది. తన సమస్యకు చికిత్స కూడా తీసుకుంటుంది. అయితే కవిత ఎవరినీ కలిసేది కాదని.. మాటిమాటికీ చనిపోతానని చెబుతుండేదని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. అయితే తాను చనిపోతే తన పిల్లలను ఎవరూ పట్టించుకోరని క్షణికావేశంలో నిద్రిస్తున్న పిల్లల మెడకు చున్నీ బిగించి హతమార్చింది. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం శ్యామ్ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. అప్పటికే వారు మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.