రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (డీబీవీ స్వామి) అన్నారు. జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్‌తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మీద నమ్మకంతో పరిశ్రమలు ఏపీకి క్యూ కడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి అపోలో టైర్స్ కంపెనీ తెచ్చారని.. గత ఐదేళ్లలో జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా అని ఎద్దేవా చేశారు. నాడు కాకమ్మ కథలు చెప్పిన నాయకులు నేడు పెట్టుబడులపై విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కానీ కళ్లు లేని వైసీపీ కబోధులు దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. అభివృద్ధిని చూడలేకనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలంటే వైసీపీ నాయకులను ఇప్పటికే అరెస్టు చేసి ఉండొచ్చని తెలిపారు. కానీ వైసీపీ నాయకులు ఎవర్నీ టచ్ చేయలేదని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారిని చట్టపరంగా శిక్షించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. అప్టపి విధ్వంసం నుంచి ఏపీని బయటకు తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఏడాదిగా జగన్ అండ్ కో దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజలు అవకాశం ఇవ్వరని అన్నారు.