Nara Lokesh | హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వైజాగ్‌లో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్యస్థానమని తెలిపారు. 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని అన్నారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టబుడులు రాబోతున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 50 శాతం విశాఖకే వస్తాయని పేర్కొన్నారు. పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతుందని నారా లోకేశ్ తెలిపారు. దీనిపై త్వరలోనే ఢిల్లీలో ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారని పేర్కొన్నారు. ఇక టీసీఎస్‌కు తక్కువ ధరకు భూములు కేటాయించామని కొందరు కోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. టీసీఎస్‌కు భూ కేటాయింపుల తర్వాత అనేక సంస్థలు ఏపీకి క్యూ కట్టాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.