Nadendla Manohar | పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన రెండో గోదాములపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.
గోదాముల్లో స్టాక్స్ తగ్గిందని నవంబర్ 27న మచిలీపట్నం జేఎస్ గోడౌన్స్ చెప్పిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మూడు వేల బ్యాగుల షార్టేజి కనబడుతుందని చెప్పిందన్నారు. గోదాముల్లో మాయమైన ధాన్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారని తెలిపారు. పేర్ని నానికి చెందిన రెండో గోడౌన్‌పై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావాల్సిందేనని తెలిపారు. అనవసరంగా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని.. తప్పు చేసిన ఎవర్నీ ఈ ప్రభుత్వం వదలదని స్పష్టం చేశారు. ప్రతి గోడౌన్లో ఎంత స్టాక్ ఉందో లెక్కలు తీయడం మొదలుపెట్టామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు.
పేర్ని నానికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు పరామర్శించడాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసిందని దుయ్యబట్టారు. అందుకే పేర్ని నాని కుటుంబమంతా పరారీలోనే ఉందని పేర్కొన్నారు. దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని విమర్శించారు. పేదల బియ్యం నొక్కేసి పేర్ని నాని నీతి కబుర్లు చెబుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండిపడ్డారు. పేర్ని నాని వ్యవహారంతో వైసీపీ మొత్తం దొంగల పార్టీనే అని అర్థమవుతుందని విమర్శించారు.