New Ration Cards | ఏపీకి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కంది పప్పు రూ.150కే అందిస్తున్నామి చెప్పారు. నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఇవ్వాలని కోరామన్నారు. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ఇప్పుడు ఉన్న 5 నుంచి 13కి పెంచాలని కోరామని తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశమయ్యారు. అనంతరం ఆంధ్ర భవన్లో ఆయన మాట్లాడుతూ.. విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. విభజన జరిగినప్పుడు జనాభా ప్రతిపాదికన కాకుండా.. 2001 సెన్సెక్స్ ప్రకారం కేటాయించారు. దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఆటంకం లేకుండా ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
రేషన్ డోర్ డెలివరీ అంటూ వైసీపీ ప్రభుత్వం రూ.1800 కోట్లు వృథా చేసిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ డోర్ డెలివరీపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అర్హత ఉన్న వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. టార్గెట్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.