Minister Kolusu Parthasarathy | గత వైసీపీ ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అత్తారింటికి దారేది తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచించుకున్నారని ఎద్దేవా చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో శుక్రవారం నాడు మంత్రి పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తన చాంబర్ పనులు పూర్తికాకపోవడంతో తాత్కాలిక చాంబర్లో విధులు నిర్వహించారు. తాజాగా చాంబర్ పనులు పూర్తవ్వడంతో ఇవాళ కొత్త చాంబర్లోకి మారారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పరిపాలనలో చేసిన తప్పులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతున్నారని తెలిపారు.
వంద రోజుల పాలనలో ఇబ్బందులున్నా అనేక సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సత్తా చాటేలా ఒకే రోజులో 60 లక్షలకు పైగా పింఛన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుదే అని తెలిపారు. గత ప్రభుత్వం అన్నింటిపైనా రంగులు, బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడుతుందని తెలిపారు.