AP News | వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సీట్ల కేటాయింపులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేస్తున్న మార్పులు చాలామందికి మింగుడుపడటం లేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలుగా.. ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లను ఇస్తున్నారు. ఈ మార్పులు చేర్పులు నచ్చకపోవడంతో కొందరు విముఖత ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసుకున్న ఏపీ మంత్రి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన ప్రకటన చేశారు.
ఒకరకంగా కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేశారు. తన అనుచరులతో శుక్రవారం సమావేశమైన గుమ్మనూరు.. ఎంపీ టికెట్ తన కుడి జేబులో ఉందని.. మీరు ఢిల్లీ వెళ్లమంటే వెళ్తానని అన్నారు. లేదు ఇక్కడే ఉండాలంటే.. ఇక్కడే ఉంటానని అన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉంది.. కాబట్టి ఆలోచిస్తానని చెప్పారు. ఏదైనా సరే కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. నామినేషన్ వేసిన తర్వాత సైతం బీఫారాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. తనను ఎంపీగా వెళ్లమంటారా? అక్కడే ఉండమంటారా? అనేది తేల్చాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ఆదేశిస్తే అనేక దారులు ఉన్నాయని.. వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.