Gummadi Sandhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేశామని గుర్తుచేశారు.
దమ్ముంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు గుమ్మడి సంధ్యారాణి సవాలు విసిరారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని హితవు పలికారు. ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి అన్నారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ప్రజా వ్యతిరేక పనులతోనే ఎన్నికల్లో ఓడిపోయారని ఆరోపించారు. వైసీపీ హయాంలో సర్పంచ్లను పట్టించుకోలేదని.. అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.