AP News | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. రోడ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరి తప్పులేంటో అసెంబ్లీలో చర్చిద్దామని అన్నారు. తప్పులు చేసినందుకే భయపడి.. జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.
జగన్ అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు మైక్ ఇస్తామని బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పులివెందుల పౌరుషం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాలు విసిరారు. జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అన్నారు. ప్రజలే పక్కన పెట్టినా జగన్‌కు సిగ్గురావడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని అన్నారు. దీంతో పెట్టుబడిదారులు సైతం రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే చివరకు ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాదని జోస్యం చెప్పారు. పోర్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్‌మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తప్పు చేసినవారిని కచ్చతంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.