AP News | ఏపీలోని ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు అక్రమంగా మద్యం తరలించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మద్యం, బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరినట్లు తెలుస్తోంది. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం టెండర్లను పక్కదారి పట్టించినట్లు అనుమానాలు ఉన్నాయి.
హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని అధికారులు చెప్పారు. అనుభవం లేని కంపెనీలకు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే హోలోగ్రామ్ కంపెనీలకు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇస్టానుసారం టెండర్లు కట్టబెట్టారని తమ విచారణలో తెలిసిందని వెల్లడించారు. ఇక జీఎస్టీ లావాదేవీల సమాచారం, గతంలో చేసిన వ్యాపారాల వివరాలు లేకుండానే టెండర్లు కట్టబెట్టినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు గుర్తించామని చెప్పారు. సాంకేతిక కమిటీ సమావేశం మినట్స్ కూడా గల్లంతైనట్లు విచారణలో వెలుగు చూసినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలోని ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ మద్యం విషయంలో అడుగడుగునా తప్పిదాలు చేసిందని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పేదల జేబులు చోరీ చేశారని మండిపడ్డారు.