మెహిదీపట్నం, మార్చి 17: రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులను, అప్పులు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే వారిని తుపాకీతో బెదిరిస్తూ, భయపెడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మాసాబ్‌ట్యాంక్ పోలీసులు మంగళవారం సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఓ పిస్టల్, 18 సజీవ రౌండ్లు, 2 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసించే మహమ్మద్ అఫ్రోజ్ బేగ్ అలియాస్ షకీల్(46) ఎంఏబీ ప్రాజెక్ట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
బోడుప్పల్లో నివసించే తెల్గెరి బాల్కిషన్ అలియాస్ బాల్ రాజ్(30) పాల వ్యాపారం చేస్తూ షకీల్‌కు అనుచరుడిగా ఉంటున్నాడు. బీహార్ పాట్నాకు చెందిన బిట్టుకుమార్ అలియాస్ రాజు(30) భువనగిరిలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా షకీల్ తనకు రియల్ఎస్టేట్లో పెట్టుబడుల కోసం డబ్బులు ఇచ్చిన వారిని, అప్పు ఇచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న వారిని భయపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
దీని కోసం బాల్‌రాజ్ తన బంధువు డైరీ ఫామ్‌లో పనిచేస్తున్న బిట్టుకుమార్ సహకారంతో బిహార్ నుంచి పిస్టల్, బుల్లెట్లను తెప్పించి షకీల్‌కు ఇచ్చాడు. షకీల్ పిస్టల్ చూపి తన వద్ద పెట్టుబడులు పెట్టిన వారిని, అప్పులు ఇచ్చిన వారిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మాసాబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేష్‌లు తమ బృందంతో కలిసి ఈ ముగ్గురిని దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఓ పిస్టల్ ,18సజీవ రౌండ్లు, 2 మ్యాగజైన్లు, ఓ కారు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.