Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమలకు రావద్దని జగన్‌కు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని.. ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని గుర్తుచేశారు. జగన్‌కు తిరుమల వెళ్లే ఇష్టం లేకే పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు. టాపిక్ డైవర్ట్ చేయడానికి నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు. జగన్‌ను ఆపే ప్రయత్నం తామేం చేయలేదని అన్నారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులు వాళ్లు అని అన్నారు.
తప్పు చేసి క్షమాపణ కూడా కోరడం లేదని వైఎస్ జగన్‌పై వంగలపూడి అనిత మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుబట్టడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ పోలీసులతో కాకపోతే సాక్షి ఉద్యోగులతో వేయాలా అని ప్రశ్నించారు. గతంలో మీ దగ్గర పనిచేసిన పోలీసులే సిట్‌లో ఉన్నారని చెప్పారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తిరుమల విషయంలో గ్యాగ్ ఆర్డర్ కోసం ఎందుకు కేసు వేశారని నిలదీశారు.
డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి వెళ్లడానికి ఇబ్బంది ఏంటి అని జగన్‌ను వంగలపూడి అనిత ప్రశ్నించారు. హైందవ సాంప్రదాయలను ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. మసీదులు, చర్చిలు, ఆలయాలకు ప్రత్యేక ఆచారాలు ఉంటాయని.. ఆయా ప్రార్థనా మందిరాలకు వెళ్లినప్పుడు ఆ ఆచారాలను గౌరవించాలని ఆమె వివరించారు. జగన్ ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదని అనిత గుర్తుచేశారు. అలాంటి జగన్ ఆలయంలో దళితుల ప్రవేశంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. నేను హిందువును.. నువ్వు నీ మతమేంటో ధైర్యంగా చెప్పగలవా అని జగన్‌ను వంగలపూడి అనిత ప్రశ్నించారు.