Tirumala | తిరుమలకు వచ్చే భక్తులకు ఆత్మరక్షణ పేరిట కర్రలు ఇవ్వడం హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మెట్ల దారిలో భక్తులు సురక్షితంగా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వంగలపూడి అనిత అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరి వెళ్లారు. అలిపిరిలోని తొలి మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడక ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరుమలలో బస చేసిన శనివారం ఉదయం ఆమె స్వామివారిని దర్శించుకోనున్నారు.
కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. భక్తులపై అడవి జంతువులు దాడి చేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెట్ల మార్గంలో ఫెన్సింగ్ ఉండాలని సూచించారు. నడక మార్గంలో దర్శనం టోకెన్ల జారీని పునరుద్ధరించాలని ఆదేశించారు.
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు మిస్సింగ్ కేసుపై కూడా వంగలపూడి అనిత స్పందించారు. ఎంపీడీవో ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఆయన సురక్షితంగా తిరిగివస్తారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తమ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు.
తిరుమలలో ఇటీవల వన్యమృగాల దాడులు ఎక్కువయ్యాయి. కాలినడకన వెళ్లే మార్గంలో తరచూ చిరుతపులులు కనిపిస్తున్నాయి. చిరుత దాడిలో గత ఏడాది ఒక బాలిక కూడా మరణించింది. ఈ నేపథ్యంలో నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఒక చేతి కర్ర ఇవ్వాలని అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయించారు. భక్తుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పుడు ఆయన వివరించారు. కానీ ఇలా చిరుత నుంచి రక్షించుకోవడానికి కర్రలు ఇవ్వడంపై చాలానే విమర్శలు వచ్చాయి.