అమరావతి : తిరుమల,తిరుపతి దేవస్థానంలో పరకామణి( Parakamani case ) లెక్కింపులో జరిగిన అవినీతిపై ఏపీ హైకోర్టు ( High Court ) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది నేరం, దొంగతనం కంటే పెద్దదని వెల్లడించింది .
వైసీపీ హయాంలో టీటీడీ ( TTD ) పరకామణి లెక్కింపులో ఉద్యోగి స్వామివారికి సమర్పించిన విదేశి నోట్లను దొంగతనం చేసి సీసీ కెమెరాకు చిక్కాడు.దీంతో గమనించిన అధికారులు అతడిపై తాత్కాలిక చర్యలు తీసుకుని వదిలేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరకామణి కేసును తిరగదోడారు. చోరీకి పాల్పడ్డ ఉద్యోగితో పాటు ఆయనకు సహకరించిన ఉన్నతాధికారులు, నాటి ప్రభుత్వంలోని పెద్దలపై చర్యలు తీసుకోవాలంటూ భక్తుడొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళవారం కేసు విచారణకు రాగా హైకోర్టు పైవిధంగా స్పందించింది.
బాధ్యతారాహిత్యంతోనే చోరీ ఘటన జరిగిందని ఆరోపించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ప్రస్తుతమున్న పాలకవర్గానికి సూచించింది . టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది. ఔటోసోర్సింగ్ ఉద్యోగికి ఏమాత్రం బాధ్యత ఉండని వ్యాఖ్యనించింది. విరాళాల లెక్కింపు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, లెక్కింపులో భక్తులకు అవకాశం కల్పించాలని సూచించింది.