YS Jagan | మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. జగన్ పాస్‌పోర్టు రెన్యువల్‌ను విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికే పరిమితం చేయగా.. దాన్ని ఐదేళ్లకు పెంచాలని ఏపీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన పూచీకత్తు షరతు రద్దుకు మాత్రం నిరాకరించింది. ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ.20వేల పూచీకత్తు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పాటు కింది కోర్టు విధించిన మిగతా షరతులన్నీ అలాగే ఉంటాయని తెలిపింది.
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌కు డిప్లోమాట్ పాస్‌పోర్టు ఉండేది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ పాస్‌పోర్టు రద్దయ్యింది. దీంతో జనరల్ పాస్‌పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు జనరల్ పాస్‌పోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్‌పై 2018 నుంచి పరువు నష్టం కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో అక్కడి నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్ఓసీ కోసం విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా.. ఏడాది కాలపరిమితితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణకు అనుమతించింది. అలాగే రూ.20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. ఈ నెల 6 నుంచి 27 లోపు లండన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. పాస్‌పోర్టును పునరుద్దరించేందుకు సీబీఐ కోర్టు ఐదేళ్లు అనుమతిస్తే.. విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలపడంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పాస్‌పోర్టు రెన్యువల్‌కు ఐదేళ్లకు పెంచుతూ అధికారులను ఆదేశించింది.
వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 3న సతీసమేతంగా లండన్ వెళ్లాలని అనుకున్నారు. తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం ఈ నెల 25వ తేదీ వరకు అక్కడే ఉండాలని అనుకున్నారు. కానీ అంతలోనే డిప్లోమాట్ పాస్‌పోర్టు రద్దు కావడంతో.. జనరల్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఐదేళ్ల కాలపరిమితితో జనరల్ పాస్‌పోర్టు తీసుకునేందుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జగన్ లండన్ టూర్‌కు క్లియరెన్స్ లభించినట్లయ్యింది.