Sankranthi | సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పేకాట, కోడిపందేలను అడ్డుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెకర్లను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం ద్వారా జీవహింసకు పాల్పడుతున్నారని, వాటిని అడ్డుకోవాలంటూ ఇటీవల హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కూడా అందులో కోరారు. వీటిపై విచారణ జరిపిన ధర్మానసం.. కోడి పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టాలనుకఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. గ్రామాల్లో సభలు నిర్వహించి చట్ట నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. బరుల వద్ద కోడి కత్తులు, ఇతర పందెం సామగ్రి, సొమ్మును తక్షణం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని సూచించింది.
ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు ధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. సంయుక్త తనిఖీల్లో తహసీల్దార్, ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫొటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది.