Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్‌తో పాటు శ్రీనివాసరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైలులో ఉన్న నందిగం సురేశ్ బెయిల్ కోసం ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎంపీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని.. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉండటంతో సురేశ్‌కు బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా, గుంటూరు జైలులో ఉన్న సురేశ్ రిమాండ్ గురువారంతో ముగిసిన నేపథ్యంలో ఆయన్ను మంగళగిరి కోర్టులో నిన్న హాజరుపరిచారు. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో నందిగం సురేశ్ రిమాండ్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.