తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకవర్గానికి ( TTD ) , అధికారులకు ఏపీ హైకోర్టు ( High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణి ( Parakamani ) లో చోరీ ఘటనపై ప్రత్యేకంగా విచారిస్తున్న హైకోర్టు శుక్రవారం టీటీడీకి పలు ఆదేశాలతో పాటు సూచనలు చేసింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని, ఇందుకు గాను ఏఐ ( Artificial Intelligence) , అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని వెల్లడించింది.
పరకామణిలో దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపులో భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కానుకల వర్గీకరణ, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని ఉపయోగించాలని, విలువైన లోహాలు వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది.
8 వారాల్లోపు ముసాయిదా రూపొందించి సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది . నిందితుడు రవికుమార్ , అతని కుటుంబ సభ్యుల ఆస్తుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల వివరాలను సీల్డ్కవర్లో వారంలోపు తమ ముందు ఉంచాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.