Simhachalam | సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. ఈదురుగాలుల వానకు గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని చెప్పారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. గోడకూలిన ప్రదేశంలో శిథిలాలను తొలగించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయంలో గోడ కూలిన ఘటనలో మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. విశాఖకు చెందిన నవ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26) ఉన్నారు. ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ.300 ప్రత్యేక దర్శనం క్యూలైన్లో ఉన్నారు. గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దుర్గా స్వామినాయుడు, ఎడ్ల వెంకట్రావు, కమ్మపట్ల మణికంఠ, ఈశ్వరరావు ఉన్నారు. మిగతా వారి వివరాలు సైతం తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో మృతి చెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.