AP News | ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు గుడ్న్యూస్ చెప్పింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ప్రస్తుతం రూ.160 ఉన్న కిలో కందిపప్పు ధరను రూ.150కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బియ్యం ధర రూ.48 ఉండగా రూ.47కి, స్టీమ్డ్ రైస్ ధరను రూ.49 నుంచి రూ.48కి తగ్గించామని తెలిపారు. రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో గురువారం నుంచి తగ్గింపు ధరలతో నిత్యవసర సరుకులను విక్రయిస్తామని పేర్కొన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించామన్నారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నెలరోజుల్లోనే బియ్యం, కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
ధరల స్థిరీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం నిత్యవసరాల ధరలను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. తొలిసారిగా ఈ నెల 11వ తేదీన నిత్యవసరాల ధరలను తగ్గించింది. అప్పుడు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.180 ఉండగా, దాన్ని రూ.160కి తగ్గించింది. అలాగే స్టీమ్డ్ రైస్ ధరను రూ.55.85 నుంచి రూ.49కి, ముడి బియ్యం ధరను రూ.52.40 నుంచి రూ.48కి తగ్గించింది.