Amaravati | అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించే ప్రాతిపదికన రాయితీపై ఐబీఎం సంస్థకు కేటాయించింది. దీనికి బదులుగా నాలుగేళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఉచిత కంప్యూటింగ్ టైమ్‌ను ఐబీఎం సంస్థ ప్రభుత్వానికి కేటాయించనుంది. ప్రభుత్వ సంస్థలు, విద్యపరమైన అంశాలకు గానూ ఈ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. విట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో రూ.6కోట్ల వ్యయంతో బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్ కంపెనీ మరో చిన్న క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం అమరావతిలో సీఆర్డీఏ ఇప్పటికే 50 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వ సంస్థగా ఏక్యూసీసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ రంగాల్లో పరిశోధనలు, యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశ్రమలు వినియోగించుకునేందుకు వీలుగా క్వాంటం వ్యాలీ సేవలు అందించనుంది. అధునాతన కూలింగ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రభుత్వం క్వాంటం వ్యాలీకి అందించనుంది.