Sugali Preethi Case | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసుపై మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులకు లేఖ రాయాలని సూచించారు.
కర్నూలులోని పాఠశాల వసతీగృహంలో 2017 ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును 2019లో వైసీపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించారు. 8 నెలలు గడిచిన తర్వాత కూడా దర్యాప్తు ప్రారంభం కాకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు 2020లో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐని వివరణ అడిగింది. దానికి ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తమ దగ్గర తగినన్ని వనరులు లేవని సీబీఐ సమాధానమిచ్చింది. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఈ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల ముందును తమ ప్రచారం కోసం చాలా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదని పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వంపై సుగాలి ప్రీతి తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించడం గమనార్హం.