Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్‌కు అమ్మేశారనే సోషల్‌మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం.. అది ఫేక్ అని కొట్టిపారేసింది. ఏపీలో యూరియా సరఫరాపై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సూచించింది.
కేంద్రం నుంచి అదనంగా యూరియా సరఫరా అవుతున్నదనే వాస్తవాన్ని వక్రీకరించి.. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను అటు నుంచి అటే జపాన్‌కు తరలించినట్లు ఒక ఫేక్ వార్తను కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం మండిపడింది. ఒక అగ్ర నటుడి ఫొటోతో కూడిన బోగస్ ఐడీతో చేస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో వాడిన ఫొటో బ్రెజిల్ దేశానికి సంబంధించినదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొంది. అలాంటి వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సూచించింది.
Fact Check Ap