AP News | రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నియమించిన సిట్‌లోని సభ్యులను మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ సభ్యులుగా ఉన్న వారిలో ముగ్గురు డీఎస్పీలు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి వారిని సిట్ సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అనుకూలంగా పనిచేసిన ముగ్గురు డీఎస్పీలను సిట్ బృందంలో ఎలా నియమిస్తారని ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. వారితో దర్యాప్తు చేయిస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిజానిజాలు బయటకు రావని ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ, సివిల్ సప్లయి, రవాణా శాఖ అధికారులను సిట్ బృందంలో చేరుస్తూ కొత్త జీవో విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్ చీఫ్‌గా కొనసాగుతున్నాయి. ఆయన నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఇందులో సీఐడీ ఎస్పీ ఉమా మహేశ్వర్, డీఎస్పీలు అశోక్‌వర్దన్, గోవిందరావు, బాలసుందర్ రత్తయ్య కొనసాగుతున్నారు.