Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయడంతో ఒక్క రోజు ముందు నుంచే సెలవులు ఇచ్చింది.
ఇక అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఎలాగూ పబ్లిక్ హాలీడే కావడంతో ఏపీ స్కూళ్లకు రేపటి నుంచే సెలవులు రానున్నాయి. అంటే దాదాపు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. దీంతో అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని తెలిపింది. ఒకవేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.